Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్ సీఎం కీలక నిర్ణయం... అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న యోచన?

బీహార్ లో నరేంద్ర మోదీ హవాకు ఎదురునిలిచి సత్తా చాటిన 'మహాఘటబంధన్' విచ్ఛిన్నమవుతోందని, సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ మధ్య విభేదాలు పెరిగాయని వార్తలు వస్తున్న వేళ, నితీశ్ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్, తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి బయటపడకుంటే, ప్రభుత్వాన్ని రద్దు చేసి, తాజాగా మరోసారి ప్రజాభిప్రాయాన్ని కోరాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే ఈ విషయమై మరింత స్పష్టత వస్తుందని 'న్యూస్ 18 డాట్ కామ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

తేజస్వీ యాదవ్ ను తొలగించాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతూ ఉండటం, ఇప్పటికిప్పుడు తొలగిస్తే, ప్రభుత్వం అస్థిరమయ్యే అవకాశాలు ఉండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న నితీశ్ కుమార్, ప్రజాభిప్రాయాన్ని కోరాలని నిర్ణయించుకోవచ్చని జేడీ (యూ) వర్గాలు వెల్లడించాయని సదరు వార్తా సంస్థ పేర్కొంది. తమ మధ్య విభేదాలపై మాత్రం ఆర్జేడీ పెదవి విప్పడం లేదు. కాగా, బీహార్ లో విజయం సాధించిన మహా ఘటబంధన్ ను మరిన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, ఎలాగైనా నితీశ్, లాలూలను కలిపి ఉంచాలనే భావిస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సోనియా గాంధీ, ఇద్దరు నేతలతో విడివిడిగా మాట్లాడింది. ఇటీవల నితీశ్ ఓ సమావేశంలో మహా ఘటబంధన్ తనకు బిడ్డ వంటిదని, తన బిడ్డను తానే ఎందుకు చంపుకుంటానని వ్యాఖ్యానించినప్పటికీ, ఆయనపై వస్తున్న ఒత్తిడిపై ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News